నిన్న భారీ సెంచరీతో సన్ రైజర్స్ కు నాలుగు ఓటముల తర్వాత అద్భుతమైన విజయం అందించిన అభిషేక్ శర్మ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. సెంచరీ పూర్తవగానే జేబులో నుంచి చీటీ తీసి చూపించిన అభిషేక్ శర్మ...దానిపై దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని రాసుకొచ్చాడు. మ్యాచ్ పూర్తయ్యాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునేప్పుడు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు అభిషేక్ శర్మ. ముందుగా ఈ విక్టరీ కి కారణమైన ఆరెంజ్ ఆర్మీ కి థాంక్స్ చెప్పిన అభిషేక్ శర్మ...ఇకపై సన్ రైజర్స్ ఆడే ఆట చాలా అగ్రెసివ్ మోడ్ లో ఉంటుందని చెప్పాడు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా తన గురువు, మెంటార్ యువరాజ్ సింగ్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నాడు అభిషేక్ శర్మ. సందర్భం ఎలాంటిదైనా సరే తన వెంటే ఉంటూ తనను ముందుకు నడిపిస్తున్న యువీ కారణంగానే ఇలాంటి సెంచరీ వచ్చిందని చెప్పాడు అభిషేక్. అయితే ఈ సారి తన విజయంలో ఓ భాగం టీమిండియా టీ20 కెప్టెన్ , ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కి కూడా ఇస్తానన్నాడు. ఇటీవలే టీమిండియాకు టీ20ల్లో ఆడుతున్న అభిషేక్ శర్మ...ఆట తీరు ఎప్పటికప్పుడు మెరుగయ్యేలా సూర్య కుమార్ యాదవ్ సలహాలు సూచనలుు ఇస్తున్నాడట. ఐపీఎల్ లో కూడా మొదటి ఐదు మ్యాచుల్లో అంతగా రాణించలేకపోయిన అభిషేక్ బ్యాటింగ్ లో కొన్ని మార్పులు సూచించాడట సూర్య కుమార్ యాదవ్. అవి వర్క్ అవ్వటంతోనే ఈ రోజు భారీ సెంచరీ సాధించానని చెబుతూ సూర్య అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పాడు. అయితే అభిషేక్ సూపర్ సెంచరీ పై యువీ కూడా స్పందించాడు. 98పరుగుల దగ్గర 99పరుగుల దగ్గర సింగిల్ తీశావ్ ఏంట్రా..నీలో ఇంత మెచ్యూరిటీ ఎప్పుడొచ్చింది. మాకు అంత తెలివి ఉండేది కాదంటూ ఫన్నీగా సెటైర్ వేస్తూనే అభిషేక్ శర్మను అభినందించాడు యువీ. మొత్తంగా ఈ విజయంతో యువీ ఎలాంటి శిష్యుడిని తయారు చేశాడో ప్రపంచానికి మరో సారి చెప్పిన అభిషేక్ శర్మ..ఈ సీజన్ లో ఇక మిగిలిన మ్యాచుల్లో సన్ రైజర్స్ ఎలాంటి రుద్ర తాండవం ఆడనుందో నిన్న కొట్టిన భారీ సెంచరీతో ముందుగానే స్క్రీన్ మీద బొమ్మేసి చూపించాడన్నమాట.